E-Attorney App: చదువు, ఆటపాటలతో కాలం గడిపే వయసు అది. వీడియో గేమ్స్‌తో కుస్తీ పడే వయసులో ఈ బుడతడు కోడింగ్వైపు దృష్టిసారించాడు. కేవలం పదేళ్ల ప్రాయంలోనే లాయర్ల కోసం ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగళూరుకు చెందిన ఆర్.కనిష్కర్ 'ఈ-అటార్నీ' అనే యాప్ తయారుచేశాడు.
కనిష్కర్ తండ్రి ఓ లాయర్. వివిధ కేసు ఫైళ్లను భద్రపరుచుకోవడంలో తన తండ్రి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కనిష్కర్.. ఈ యాప్‌ను తయారు చేయాలని భావించాడు. అప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ వద్ద కోడింగ్ నేర్చుకుంటున్నాడు. దీంతో యాప్ తయారుచేయడం అతనికి సులభమైంది. మొదట దీనిని ఓ చిన్న యాప్‌గా కనిష్కర్ రూపకల్పన చేసినా.. ఆ యాప్ ప్రాధాన్యం తెలుసుకున్న వైట్‌హ్యాట్ సంస్థ అతడిని ప్రోత్సహించింది.
"పని ఒత్తిడి కారణంగా నాన్న ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చేవారు. ఆయన ఆఫీసుకు నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. కేసు డాక్యుమెంట్లు పొందుపరచడం కోసం ఆయన జూనియర్లు తర్జనభర్జన పడుతుంటారు. దీని వల్ల పని మరింత ఆలస్యం అవుతుంది. అందుకే లాయర్లకు పని సులువు అయ్యేలా ఓ యాప్ తయారు చేయాలని భావించాను."
-ఆర్. కనిష్కర్, 'ఈ-అటార్నీ' రూపకర్త