ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడప క్వారీ పేలుళ్ల ఘటనపై.. సంయుక్త నిపుణుల కమిటీ!

By

Published : May 23, 2021, 11:09 AM IST

కడప జిల్లా మామిళ్లపల్లి ఘటనపై నివేదిక సమర్పించాలని సంయుక్త నిపుణుల కమిటీని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశించింది. జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లకు కారణమైన క్వారీ నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారా? వారికి లైసెన్స్‌ ఉందా అనే విషయాలను తేల్చి నివేదిక ఇవ్వాలంది.

కడప క్వారీ పేలుళ్ల ఘటనపై సంయుక్త నిపుణుల కమిటీ
కడప క్వారీ పేలుళ్ల ఘటనపై సంయుక్త నిపుణుల కమిటీ

కడప జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లకు కారణమైన క్వారీ నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారా? వారికి లైసెన్స్‌ ఉందా అనే విషయాలను తేల్చడంతో పాటు ఘటనపై నివేదిక సమర్పించాలని సంయుక్త నిపుణుల కమిటీకి జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశించింది. మామిళ్లపల్లి సమీపంలోని బైరటీస్‌ క్వారీకి జిలెటిన్‌ స్టిక్స్‌ తరలిస్తున్న వాహనంలో పేలుడు సంభవించి ఈనెల 8న పది మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఎన్జీటీ సుమోటోగా స్వీకరించగా...జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, విషయ నిపుణుడు డాక్టర్‌ కె.సత్యపాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం కేసు విచారణ చేపట్టింది. సంబంధిత ఉత్తర్వులు శనివారం వెలువడ్డాయి.

పేలుళ్లపై తాము ఇప్పటికే కమిటీని నియమించి, క్వారీ లైసెన్సుదారులపై తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మాధురి దొంతిరెడ్డి ట్రైబ్యునల్‌కు నివేదించారు. ఇలాంటి సందర్భాల్లో నియమిస్తున్న కమిటీలు... తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన, లైసెన్సు నిబంధనల అతిక్రమణ, రాయల్టీ, జరిమానా అంశాలకే పరిమితమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే క్వారీ నిర్వాహకులకు ఉన్న అనుమతులు, వాటికి మించి చేసిన తవ్వకాలు, పర్యావరణానికి జరిగిన నష్టం, సహజ వనరుల దోపిడీ, అందుకు చెల్లించాల్సిన పరిహారం, పేలుళ్లతో చనిపోయిన, గాయపడిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్ర విచారణకు సంయుక్త నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ అంశాలతో పాటు అక్కడికి సమీపంలో ఇతర క్వారీలు, వాటి నిర్వహణ, నిబంధనల ఉల్లంఘనలు, తీసుకుంటున్న చర్యలపైనా మరో నివేదిక సమర్పించాలని సూచించింది.

కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సీనియర్‌ అధికారి, కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై కార్యాలయం అధికారి, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఛైర్మన్‌ సూచించిన సీనియర్‌ అధికారి, కడప జిల్లా కలెక్టర్‌, ఆ ప్రాంత భూగర్భ, ఖనిజ శాఖ సహాయ సంచాలకుడు సభ్యులుగా ఉంటారంది. కమిటీ జులై తొమ్మిదో తేదీలోపు నివేదికలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తాము నియమించిన కమిటీ నివేదిక సమర్పించేలోపే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పేలుళ్ల ఘటనపై నియమించిన కమిటీల నివేదికలు సమర్పించాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణను జులై 9కి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు.. నాటు మందు'

ABOUT THE AUTHOR

...view details