Deputy CM Pawan Kalyan Varahi Sabha in Pithapuram: పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ వారాహి సభ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారని కొనియాడారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతీ మనిషికి అండగా నిలవాలనుకున్నానని కాని మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని అన్నారు. 100 శాతం స్ట్రయిక్ రేటు దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చూడలేదని అన్నారు.
లంచాలు అవసరం లేదు: గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాక నీయమని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారని అన్నారు. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారని, కానీ బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు వెల్లడించారు. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదని నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. బాధ్యతగా ఉండాలనే తమ శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ - ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం - White Paper on Amaravati
పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నా: లంచాలు తీసుకోకుండా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని పవన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నానని అన్నారు. గతంలో వైఎస్సార్సీపీ నాయకులు పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్‌లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నానని, ఈ రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఉపాధి అవకాశాలు వంటి హామీలన్నీ గుర్తున్నాయని అవన్నీ నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. నా కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి వచ్చి తన బాధ చెప్పుకొందని ఆమె కష్టం తీర్చాలని 9 రోజులు తాపత్రయపడ్డినట్లు తెలిపారు.
వాలంటీరు లేకుండానే పింఛన్ల పంపిణీ: ఓటర్లు రక్తం చిందించకుండా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారని పవన్ కొనియాడారు. కూటమి నేతలు పింఛను పంచలేరని వైఎస్సార్సీపీ నేతలు అంటే మొదటి రోజే ఆ పని చేసి చూపించామని అన్నారు. ఒక్క వాలంటీరు సాయం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని తెలిపారు. పంచాయతీరాజ్ గురించి ఎన్నో ఫైల్స్ చదువుతున్నానని, వైఎస్సార్సీపీ హయాంలో అడ్డగోలుగా నిధులు దారి మళ్లించారని మండిపడ్డారు. రుషికొండకు చేసిన రూ.600 కోట్ల ఖర్చులో కొంచెమైనా రోడ్లకు కేటాయించి ఉంటే బాగుపడేవని అన్నారు. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తామని గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తామని తెలిపారు.
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబుతో కలిసి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతా సీఎం సీఎం అంటున్నారు కాని అమ్మవారు నన్ను డిప్యూటీ సీఎంని చేశారని అన్నారు. పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించానని ఏ వినతులైనా వారు స్వీకరిస్తారని తెలిపారు. ఉపాధి, వైద్యం, శాంతిభద్రతల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని ఈ అయిదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.
యువతి అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు- పవన్ ఆదేశించిన 48గంటల్లో వీడిన మిస్టరీ - Woman Missing Case