ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'గిన్నీస్' రికార్డుల 'సూక్ష్మ కళా' మాంత్రికుడు

By

Published : May 8, 2019, 7:03 AM IST

వ్యక్తిగత ప్రతిభ విభాగంలో గిన్నీస్‌బుక్‌ రికార్డు సాధించడం అనేది ఎంతో కష్టతరం. అలాంటిది ఏకంగా మూడుసార్లు వరుసగా గిన్నిస్‌ రికార్డు సాధించాడు  ఓ స్వర్ణకారుడు. సూక్ష్మవస్తువుల తయారీలో అరుదైన  ఘనత సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

'గిన్నీస్' రికార్డుల 'సూక్ష్మ కళా' మాంత్రికుడు

'గిన్నీస్' రికార్డుల 'సూక్ష్మ కళా' మాంత్రికుడు
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన తాళాబత్తుల సాయి స్వర్ణకారుడు. వీరి కుటుంబం అనాదిగా బంగారు వస్తువుల తయారీ చేస్తూ నగల దుకాణాన్ని నడుపుతోంది. పెద్దాపురానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చేందుకు ఏదైనా చేయాలనే సంకల్పంతో సూక్ష్మ వస్తువుల తయారీని ప్రారంభించాడు.

వరసగా మూడు సార్లు గిన్నీస్...

2016లో 8 * 4 మిల్లీమీటర్ల సూక్ష్మ ఎలుకల బోను గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కింది. 2017లో నాటికల్‌ నాట్‌ బోల్ట్‌ను 5 * 7 సెంటీమీటర్లు కొలతలతో తీర్చిదిద్ది మరోసారి గిన్నీస్ ఘనత సాధించాడు. 2018లో సూక్ష్మ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను 5.3 సెంటీమీటర్ల పొడవుతో తయారుచేసి ముచ్చటగా ముడోసారి గిన్నీస్ రికార్డుకెక్కాడు.

బొట్టు బిళ్లలతో కళా ఖండాలు....

సాయి చేతి నుంచి రూపుదిద్దుకున్న కళాఖండాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో 20వేల బొట్టు బిళ్లలతో ఎన్టీయార్‌ చిత్రపటం, 8వేల బొట్టు బిళ్లలతో వినాయకుడి ఆకృతి, 6 వేల బొట్టుబిళ్లలతో గౌతమబుద్దుడి చిత్రపటాలను ఎంతో ఆకర్షణీయంగా రూపొందించాడు.

బహుమతులు కోకొల్లలు...

పెన్సిల్‌ ముల్లు మీద గౌతమ బుద్దుడు, ఎగురుతున్న చేప, శివుడు, నందీశ్వరుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడుతో పాటు... బంగారంతో పూర్ణకుంభం, సీతాకోకచిలుకలు, పువ్వుల కుండీ, బంగారు పెన్ను, దిక్సూచి లాంటి వస్తువులకు రూపమిచ్చాడు. ఈ కళాఖండాలతో గిన్నీస్‌బుక్‌ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను సాయి సాధించాడు.

2005 నుంచి 2010 వరకూ పెద్దాపురంలో తెలుగుదేశం తరుపున కౌన్సిలర్‌గా పనిచేసిన... సాయి ప్రతిభ, పురస్కారాలపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సూక్ష్మ కళపై కళాకారుడు సాయి సిద్దాంత వ్యాసాలను సైతం రచించాడు. లండన్‌లోని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనివర్శిటీ సాయికి గౌరవ డాక్టరేట్‌ అందించింది. రాబోయే రోజుల్లోను మరిన్ని విజయాలు సాధించాలన్నదే తన ధ్యేయమని స్వర్ణ మాంత్రికుడు చెబుతున్నాడు.

ఇవీ చూడండి-నచ్చిన బొమ్మ అద్దెకొచ్చెనమ్మ... అల్లరి తగ్గించెనమ్మ!

ABOUT THE AUTHOR

...view details