ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS Collectors Meeting: కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం.. పథకాల అమలుపై ప్రధాన చర్చ

By

Published : Dec 18, 2021, 12:25 PM IST

Collectors Meeting:వ్యవసాయం, దళితబంధు అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు తెలంగాణలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. పథకాల అమలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృతంగా చర్చించనున్నారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్ వేదికగా మంత్రులు, కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ ఓ కార్యాచరణ ఖరారు చేసి వారికి మార్గనిర్దేశం చేయనున్నారు.

TS Collectors Meeting
TS Collectors Meeting

Collectors Meeting: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ కానున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరగనున్న సమావేశంలో మంత్రులు, సీనియర్ అధికారులు, కలెక్టర్లు పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలు, తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాం సాగర్ మండలాల్లో పైలట్ పద్ధతిన పథకాన్ని అమలు చేస్తున్నారు.

దళితబంధుపై ప్రధాన చర్చ

తెలంగాణలోని యాదాద్రి జిల్లా వాసాలమర్రితోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో కొంతమంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కూడా పూర్తయింది. మిగతా వారికి సంబంధించి వివిధ దశల్లో ఉండగా నాలుగు మండలాల్లో ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థికఏడాదిలో అన్ని నియోజకవర్గాల్లోనూ కొన్ని కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తామని తెలంగాణ సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పథకం అమలు, హుజురాబాద్ అనుభవాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. వాటి ఆధారంగా తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ విషయమై కూడా సమావేశంలో సూచనలు అందించనున్నారు.

యాసంగిలో పంటల సాగుపై అధికారులకు దిశానిర్దేశం

ధాన్యం సేకరణ సహా సాగు సంబంధిత అంశాలపై కూడా కలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ తీరుతెన్నులు, ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ఇదే సమయంలో తదుపరి కార్యాచరణ విషయమై విస్తృత చర్చ జరగనుంది. యాసంగిలో పంటల సాగు అంశంపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రైతుల్లో విస్తృత అవగాహన కల్పించడం, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి.. ఓ కార్యాచరణ ఖరారు చేసే అవకాశముంది. జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి మార్గానిర్దేశం చేయనున్నారు. యాసంగికి సంబంధించిన రైతుబంధు చెల్లింపులపై కలెక్టర్ల సమావేశంలో తేదీ ప్రకటించే అవకాశముంది. వీటితోపాటు కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, పోడుసమస్య, పల్లె, పట్టణప్రగతి, హరితహారం, కేసీఆర్ జిల్లాల పర్యటన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. వైద్యకళాశాలలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, ధరణి సమస్యల పరిష్కారం సహా ఇతర అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.

ఇదీ చదవండి:

Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్​న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details