ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు స్వయం సహాయక బృందాలు- ప్రత్యేకంగా రేషన్ కార్డులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 10:30 PM IST
Ration Cards to Transgenders in AP :అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, అధికారులు అలసత్వం వీడి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అంధ విద్యార్థులకు ఒకేషనల్, నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టాలని మంత్రి సూచించారు. ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలి. ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ట్రాన్స్ జెండర్లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని మంత్రి అధికారులకు సూచించారు.