'ఆత్మహత్యా పేటిక' సాయంతో వ్యక్తి మృతి - సహకరించిన వ్యక్తులు అరెస్ట్!
Published : Sep 25, 2024, 9:08 AM IST
Suicide Capsule Death In Swiss : కొత్తగా రూపొందించిన 'ఆత్మహత్యా పేటిక' (సూసైడ్ క్యాప్సుల్) సాయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్విట్జర్లాండ్లో జరిగింది. దీనితో ఈ ఆత్మహత్యకు సహకరించారన్న అనుమానిస్తున్న పలువురిని స్విట్జర్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు తెలిపారు. మరొకరి సాయంతో జీవితాన్ని చాలించేందుకు ఉపయోగించే ఈ పేటికను ‘సార్కో’ అంటారు. గతంలో ఎవరూ దీన్ని ఉపయోగించలేదు. ఒక మనిషి పట్టేలా శయ్య ఉన్న ఈ పేటిక లోపలికి వెళ్లి, మీట నొక్కితే సీల్డ్ ఛాంబర్‌లోకి నైట్రోజన్ వాయువు విడుదల మొదలవుతుంది. లోపల నిద్రపోతున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో ఊపిరాడక మరణిస్తాడు. మేరీషాజన్ అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి, కొందరి సాయంతో ‘సార్కో’ ద్వారా సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.