తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి భారీ ఊరట- సుప్రీం బెయిల్ మంజూరు
Published : Sep 26, 2024, 1:31 PM IST
SC Granted Senthil Balaji Bail:మనీలాండరింగ్ కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగాలకు నగదు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత ఏడాది జూన్ 14న సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. అన్నాడీఎంకే సర్కారులో సెంథిల్ బాలాజీ రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది. ఆగస్టు 12న సెంథిల్ బాలాజీపై 3 వేల పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. అంతకుముందు బెయిల్ కోసం బాలాజీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి రెండుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, పాస్‌పోర్టును అప్పగించాలని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 15నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.