Khalistan Terrorist Arsh Dallas : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ డి-ఫాక్టో చీఫ్ అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాను అరెస్టు చేసిన వేళ, భారత ఏజెన్సీలు అతడి అప్పగింత విజ్ఞప్తిపై పని చేస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 2023లో దల్లాను ఉగ్రవాదిగా గుర్తించిన భారత్, అతడిని అరెస్టు చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరగా, ఒట్టావో ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.
50కి పైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ ఉగ్రవాద నిధుల కేసుల్లో నేరస్థుడైన దల్లాపై 2022లో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు వివరించారు. ఆయా కేసుల్లో కెనడా అధికారులకు భారత్ సమాచారాన్ని అందించిందని తెలిపారు. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద కెనడాకు ప్రత్యేక అభ్యర్థన పంపామని వివరించారు. వాటిని పరిశీలించిన కెనడా న్యాయశాఖ 2023లో ఆయా కేసుల్లో అదనపు సమాచారాన్ని కోరింది. వాటికి ఈ ఏడాది మార్చిలో భారత్ సమాధానాలు పంపింది.