హరియాణాలో ఆప్, కాంగ్రెస్ పొత్తు లేనట్లే! 20మందితో కేజ్రీవాల్ పార్టీ ఫస్ట్ లిస్ట్
Published : Sep 9, 2024, 5:03 PM IST
AAP Congress Alliance In Haryana :హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 20మంది అభ్యర్థులతో తొలి జాబితాను సొంతంగా ఆప్ విడుదల చేసింది. 11స్థానాల్లో కాంగ్రెస్‌కు పోటీగా అభ్యర్థులను ఖరారు చేసింది. 2వ అభ్యర్థుల జాబితానూ త్వరలో విడుదల చేయనున్నట్లు ఆప్ హరియాణా చీఫ్ సుశిల్ గుప్తా వెల్లడించారు. బీజేపీని హరియాణాలో రెండోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని తొలుత ఆప్, కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. 10స్థానాలు కావాలని ఆప్ పట్టుబడుతుండగా, 6-7 స్థానాలు మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్ మొండికేస్తోంది. ఈ క్రమంలో సొంతంగా 90స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. అయినా సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతూనే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. చివరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఆప్.