'మా నమ్మకం నువ్వే జగన్' - మద్యం దుకాణం ఎదుట మందు బాబుల చిందులు - YSRCP Samajika Sadikara Bus Yatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 12:52 PM IST
YSRCP Samajika Sadikara Bus Yatra: అధికార పార్టీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో మందుబాబులు చిందులు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీలు పట్టుకుని మద్యం దుకాణాల ముందుకు చేరుకుని నృత్యాలు చేశారు. మద్యం సేవించి మా నమ్మకం నువ్వే జగన్ ఫ్లకార్డులతో కనిపించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రహదారిపై నృత్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారు. ఉపాధి హామీ కూలీలపై ఒత్తిడి తెచ్చి యాత్రకు తరలించారు. యాత్ర ప్రారంభమై కొద్ది దూరం కదిలిన తరువాత నుంచే మహిళలు, పురుషులు ఆటోల్లో తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. యాత్ర ప్రారంభంలోనే జనం ఇంటి ముఖం పట్టడంతో వేదిక వద్ద ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరోవైపు పోలీసులు ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ బస్సు యాత్రలో పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డి, మంత్రి నారాయణ స్వామి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా విజయసాయిరెడ్డి సూళ్లూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్యను ప్రకటించారు.