న్యాయం చేయాలంటూ 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ'లో మహిళ ఆవేదన - పరిటాల సునీతకు మహిళ మొర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 3:43 PM IST
YSRCP Leaders Harrasement: అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అరాచకాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలాగైనా మీరే న్యాయం చేయాలంటూ బాబు ష్యూరిటీ భవిష్యత్త్ గ్యారంటీ కార్యక్రమంలో కన్నీటి పర్యంతమయ్యారు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో మాజీ మంత్రి పరిటాల సునీత బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళ తనకు జరుగుతున్న అన్యాయాన్ని సభలో వెలిబుచ్చారు.
కరోనా సమయంలో తన భర్త చనిపోతే ఆదుకుంటామని చెప్పి వైసీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తనకు అండగా ఉంటామని చెప్పి, మూడేళ్లుగా నరకం చూపిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. అర్హత కలిగినా పథకాల కోసం సంబంధిత కాగితాలు తీసుకుని రమ్మంటున్నారని, సుమారు 5వేలు ఖర్చు పెట్టి వాటిని తీసుకెళ్తే అవి పనికి రావని తిప్పి పంపించేస్తున్నారని గౌతమి తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించడం లేదని, మీరే తగిన న్యాయం చేయాలని పరిటాల సునీతను వేడుకున్నారు.