పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - జనసేన నాయకులపై దాడి - YSRCP Leaders attack on Janasena
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 1:13 PM IST
YSRCP Leaders Attack on Janasena Followers in Palnadu District : హింసారహిత ఎన్నికల నిర్వహణ అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు రాతలకే పరిమితమవుతున్నాయి. అధికార పార్టీ నాయకులు కోడ్ కన్నా ముందుకంటే ఇప్పుడు మరింతగా రెచ్చిపోతూ ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ప్రత్యర్థుల అంతు చూడటమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం మించలపాడులో జనసేన నాయకులపై హత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. జనసేన నాయకుడు పసుపులేటి ప్రసాద్, మరో నలుగురిపై వైఎస్సార్సీపీ నాయకుడు (YSRCP Leaders) మన్నెయ్య గ్యాంగ్ దాడి చేసి హత్యకు యత్నించింది.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల నుంచి ఇంటికి వెళ్తున్న పసుపులేటి ప్రసాద్ వాహనాన్ని జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు అడ్డగించి కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో వాహనం ధ్వంసమైంది. వాహనంలోని నగదును కూడా వైఎస్సార్సీపీ నాయకులు లూటీ చేశారు. హత్యారాజకీయాలపై పల్నాడు (Palnadu), నంద్యాల (Nandyala), ప్రకాశం (Prakasam) జిల్లాల ఎస్పీలను వివరణ అడిగిన రోజే ఇలాంటి మరో దాడి జరగడం రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేసింది.