పర్చూరు నియోజవర్గ వైసీపీలో ముసలం- ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న నేతలు - YSRCP Dissident Leaders Meeting - YSRCP DISSIDENT LEADERS MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 11:43 AM IST
YSRCP Dissident Leaders Meeting: రాష్ట్రం వ్యాప్తంగా టీడీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ వైసీపీ అసంతృప్త నేతలు ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ అధిష్ఠానం నిర్ణయాలపై ఆ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. చినగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డి పెదగంజాంలో తన వర్గీయులతో సమావేశమయ్యారు. వారందరి సమక్షంలో వైసీపీను వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనకు మద్దతుగా పలువురు నాయకులు వైసీపీను వీడుతున్నట్లు ప్రకటించారు.
తనతో సహా ఆరుగురు ఎంపీటీసీ, ఇద్దరు సర్పంచులు వైసీపీను వీడుతున్నారని ఎంపీపీ అంకమ్మరెడ్డి తెలిపారు. వీరు ఈ నెల 12న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సమావేశానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని వీడొద్దని అందరికీ సూచించారు. తాను పార్టీలో విసిగిపోయి ఉన్నానని, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని అంకమ్మరెడ్డి బదులిచ్చారు. టీడీపీలో ఖచ్చితంగా చేరతానని చెప్పారు.