బయటపడిన అసమ్మతి - వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య వ్యతిరేక వర్గం సమావేశం - YSRCP Dissident Leaders Meeting - YSRCP DISSIDENT LEADERS MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 9:11 AM IST
YSRCP Dissident Leaders Meeting: వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ ఇంకా అసమ్మతి సెగలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే గతంలో పలుమార్లు సమన్వయకర్తల పేరుతో అభ్యర్థులను మార్చింది. తాజాగా కొద్ది రోజుల క్రితం 175 అసెంబ్లీ, 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయినా కూడా నిత్యం అసమ్మతి వ్యక్తం అవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కృషి చేశామని, ప్రస్తుతం తమను ఎవరూ పట్టించుకోవడంలేదని అసమ్మతి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న తలారి రంగయ్యకు మనమంటే లెక్క లేదన్నారని అన్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే తమ గ్రామాలకు వచ్చి తలారి రంగయ్య ఎలా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరలోనే మరోసారి అందరూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామని చర్చించుకున్నారు.