విశాఖలో వైఎస్సార్సీపీకి భారీ షాక్- టీడీపీ, జనసేనలో చేరికలు - Some YCP Leaders Join TDP - SOME YCP LEADERS JOIN TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 12:11 PM IST
YCP Leaders Joining TDP in Presence of Chandrababu: సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే పలు వార్డులకు చెందిన వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో 29, 35 వార్డుల కార్పొరేటర్లు ఉరికిటి నారాయణరావు, భాస్కర్‌రావుతో పాటు పలువురు వార్డు స్థాయి నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో సీతంరాజు సుధాకర్, ఇతర నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల లోపే తగిన గుర్తింపు ఇస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని సుధాకర్ తెలిపారు.
విశాఖలో పార్టీ కోసం కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని అధినేతకు హామీ ఇచ్చామని సుధాకర్ వెల్లడించారు. మాజీ కార్పొరేటరు పోలిపల్లి జ్యోతి, కండిపల్లి సతీష్‌కుమార్, 35వ డివిజన్ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరీశంకర్ తదితర నేతలు టీడీపీలో చేరారు. సుధాకర్ టీడీపీలో చేరడంతో దక్షిణ నియోజకవర్గ పరిధిలో కూటమి బలపడింది. ప్రస్తుతం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ దూసుకుపోతుంటే వైసీపీ అభ్యర్థి వాసుపల్లికి చుక్కెదురవుతోంది.