రెండోసారి దొంగతానానికి వచ్చి చేతికి చిక్కారు - Villagers Catch Thief - VILLAGERS CATCH THIEF
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 8:20 PM IST
Yadavalli Villagers Catch Thief: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒక దొంగను గ్రామస్థులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి విద్యుత్ స్తంభానికి కట్టివేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం: శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య ముగ్గురు దొంగలు గ్రామంలోకి వచ్చారు. వారిలో ఇద్దరు గమనిస్తూ దూరంగా నిల్చుని ఉండగా, గ్రామస్థుడు శివకోటేశ్వరరావు ఇంటి వద్దకు మరో దొంగ చేరుకున్నాడు. అయితే 15 రోజుల క్రితమే నిక్కర్లు వేసుకుని వచ్చిన ఇద్దరు దొంగలు ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న శివకోటేశ్వరరావు భార్య మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. ఆమె చేతితో గొలుసును గట్టిగా పట్టుకోవటంతో రెండు సవర్ల బంగారు దొంగల చేతికి చిక్కగా, ఒక సవర ఆమె చేతిలో మిగిలింది. దీంతో అప్రమత్తంగా ఉన్న శివకోటేశ్వరరావు మరోసారి తన ఇంటి వద్దకు వచ్చిన దొంగను పట్టుకుని కర్రతో దేహశుద్ధి చేసి కేకలు వేయటంతో దూరంగా ఉన్న ఇద్దరు దొంగలు పరారయ్యారు. పట్టుబడిన దొంగను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతకుముందు జరిగిన దొంగతనంపై కూడా ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా సమాచారం అందించినా ఉదయం వరకూ ఘటనా స్థలానికి రాలేదని గ్రామస్థులు తెలిపారు. కాగా దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒడిశా వాసులుగా, పరిసర గ్రామాల్లో గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.