మంత్రి ఉష సభ- ప్రారంభం కాకముందే వెళ్లిపోయిన మహిళలు - నాలుగో విడత వైయస్సార్ ఆసరా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 4:40 PM IST
Womens Boycott From Minister Usha Shri Meeting in satyasai District : మంత్రి ప్రసంగం ప్రారంభం కాకముందే డ్వాక్రా మహిళలు వెనుదిరిగారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ (Minister Usha Shri ) ఆధ్వర్యంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా (YSR Asara) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు మంత్రి ప్రసంగం ప్రారంభం కాకముందే వెనుతిరిగి వెళ్ళిపోయారు. కార్యక్రమంలో కనీసం తాగునీరు సరఫరా చేయలేదని మహిళలు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాం, ఎండలు మండిపోతున్నా గుక్కెడు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గమనించిన నాయకులు సమావేశం అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలకు భోజన వసతి కల్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ నేతలు (YSRCP Leaders) ఆర్భాటంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు వారి అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారని పలువురు అంటున్నారు.