జగనన్న కోసం ఎర్రటి ఎండలో నిలబెట్టారు - ఇదేంట్రా అంటూ మహిళల అవస్థలు - సీఎం సమావేశం కోసం మహిళల అవస్థలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 9:21 PM IST
Women Faced Problems with CM Jagan Tour in Pamarru : కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం కాన్వాయ్‌కి స్వాగతం పలకటానికి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సభా వేదిక వరకు మహిళలను రోడ్డుకు ఇరువైపులా ఎండలో నిలబెట్టారు. సీఎం జగన్ రాక కోసం నిరీక్షిస్తూ మహిళలు ఎండ వేడిమికి తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా సీఎం కాన్వాయ్‌కు దగ్గరగా మహిళలను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు చెట్ల కింద కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది.
వైసీపీ నేతలు ఆర్బాటంగా అప్పటికప్పుడు సభా వేదిక ప్రాంగణంలో టెంట్లు వేసి మహిళలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. నిధుల విడుదల కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం నుంచి ప్రజలు వెనుదిరిగారు. దీంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అదే విధంగా వేసవి కాలం ప్రారంభమవడంతో ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు.