"గుంటూరు" సమస్యలన్నీ తీరుస్తా- బుర్రిపాలెం బహిరంగ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని - PEMMASANI speech - PEMMASANI SPEECH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 11:39 AM IST
Union Minister Pemmasani Chandrasekhar : రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేలా కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వగ్రామానికి గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం వచ్చారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. తొలుత తెనాలి మండలం అంగలకుదురులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెనాలిలో కాళీమాత దేవాలయాన్ని దర్శించుకున్నారు. వెస్ట్ బెర్రీ స్కూల్ వద్ద ఉన్న తన తండ్రి విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత బుర్రిపాలెం చేరుకున్న పెమ్మసాని బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు నియోజవర్గ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి స్పష్టం చేశారు. గుంటూరు నియోజవర్గ రైల్వే సమస్యలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, దానికి అన్ని విధాలుగా సహకరిస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.