మెగా డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగుల ర్యాలీ - ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో ఉద్రిక్తత - Mega DSC Notification
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 2:58 PM IST
Unemployed Rally Demanding Release Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు యువత, నిరుద్యోగ ఐకాస నాయకులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మెగా డీఎస్సీ ప్రకటించాలని మంగళగిరి గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు తెలుగు యువత నాయకులు, నిరుద్యోగ ఐకాస నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో తుళ్లూరు వైపు వెళ్తున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కాన్వాయ్‌ను నిరుద్యోగ యువత అడ్డగించారు.
మెగా డీఎస్సీ విడుదల చేయాలని సుచరిత వాహనాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగ యువతకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. యువతను పక్కకు నెట్టి సుచరిత కాన్వాయ్‌ను పోలీసులు పంపించారు. నిరుద్యోగుల్ని మోసం చేసిన సీఎంను నిలదీస్తామంటూ యువత ప్రతిజ్ఞ చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు ఇంటికి పంపేందుకు యువత ఏకంగా కావాలని నిరుద్యోగ ఐకాస నేతలు పిలుపునిచ్చారు.