కొంపముంచిన స్నేహితుల సరదా - సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతి - Two Young Persons Dead in Beach
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 7:56 PM IST
Two Young Persons Dead Being Hit by Waves in Sea : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బార్గవపేటకు చెందిన పది మంది యువకులు ఆదివారం సరదాగా గడిపేందుకు రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బాలసాయి, బాలనాగేశ్వరరావు అలల ధాటికి గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇద్దరు స్నేహితులు మృతి చెందడంతో మిగిలిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను చీరాల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే బీచ్ వద్ద మొత్తం 8 మంది మృతి చెందారని ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. బీచ్ వద్ద అధికారులు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.