స్కూలుకు వెళ్తుండగా ప్రమాదం - ఇద్దరు చిన్నారులు మృతి - Two children died in road accident - TWO CHILDREN DIED IN ROAD ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 4:48 PM IST
Two Children Died in Road Accident at Anantapur District : అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూలుకి వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ట్రాక్టర్ ఢీ కొట్టడంతో వారు మృతి చెందారు. ఈ ఘటన ఘుమ్మగట్ట మండలం ఎస్. కొత్తపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున, మల్లేష్ ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు వరుణ్ తేజ్ (8) స్పందన (9) లు రాయదుర్గం పట్టణంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఈ ఇద్దరు పిల్లలను పాఠశాలలో విడిచిపెట్టేందుకు మేనమామ సురేశ్ ద్విచక్ర వాహనంలో తీసుకెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో వరుణ్ తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్పందనను వైద్యం కోసం బళ్లారి రిమ్స్‌కు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతి చెందింది.
ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లల మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరు అన్నదమ్ములకు చెందిన పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఎస్ కొత్తపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాయదుర్గం పట్టణంలోని నారాయణ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మృతికి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఘనంగా నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. ఘుమ్మగట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.