ఏపీ విధానాలు త్రిపురలో అవలంబిస్తాం: గవర్నర్ ఇంద్రసేనారెడ్డి - TRIPURA GOVERNOR TOUR IN ELURU DIST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 9:02 PM IST
Tripura Governor Nallu Indrasena Reddy Tour in Eluru District : ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉందని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో పర్యటించిన ఆయన శ్రీలక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్వా ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు. చేపలు, రొయ్యలు, పీతల సాగు విధానాలను ఆక్వా రైతులు, మత్స్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చేపలు, రొయ్యలకు ఏదైనా జబ్బు చేసిన సమయంలో చెరువుల నీటిని పరీక్షించే విధానాన్ని గవర్నర్ ఆసక్తిగా తిలకించారు. అలాగే మంచినీళ్ల సీసాలోని నీటిని తీసుకొని పరీక్షించే విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం 20 లారీలకుపైనే ఆక్వా ఉత్పత్తులు త్రిపుర రాష్ట్రానికి వస్తుంటాయని ఆయన తెలిపారు. అందుకే ఇక్కడి ఆక్వా సాగు విధానాలను తెలుసుకుని త్రిపురలో వాటిని అవలంబించే అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. త్రిపురలో ఆక్వా సాగు అంతగా అభివృద్ధి చెందలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా సాగు చేసేందుకు వచ్చే రైతులకు రాయితీలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు.