LIVE : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - హనుమంత వాహనంపై శ్రీనివాసుడు
Published : Oct 9, 2024, 8:06 AM IST
|Updated : Oct 9, 2024, 10:30 AM IST
Tirumala Hanumantha Vahanam Live : గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజున స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షిస్తున్నారు. మాడ వీధుల్లో హనుమంత వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వాహనసేవ వైభవంగా జరుగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహనంపై భక్తులను శ్రీనివాసుడు అభయప్రదానం చేయనున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Oct 9, 2024, 10:30 AM IST