ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం- కంటిమీద కునుకు లేదంటున్న ప్రజలు - Tiger attack on cow
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 5:36 PM IST
Tiger Attack on Cow in Eluru District : ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కొవ్వాడలో ఆవుపై పెద్దపులి దాడిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆవు దూడను సగం తిని కళేబరాన్ని వదిలేసి వెళ్లిపోయింది. గ్రామంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిసిన గ్రామస్థులు, రైతులు భయాందోళనకు గురౌతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాద ముద్రలు చూసి అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో పులి జాడ కోసం ట్రాప్ కెమరాలను అమర్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులకు అధికారులు సూచించారు.
Tiger Killed The Cow : అయితే ఈ ఘటన జరగక ముందే పెద్దపులిని చూశానని ఓ వ్యక్తి తెలిపారు. జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరం వద్ద పులి రోడ్డు దాటుతుంటే తాను కళ్లరా చూశానని విఘ్ణ అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు. అనంతరం ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించానని తెలిపారు. పెద్దపులి సంచారంతో తమకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని వాపోయాడు. అటవీ శాఖ అధికారులు తొందరగా పులిని పట్టుకొని తమ ప్రాణాలను కాపాడాలని కోరారు.