Apartment Prices in Hyderabad : హైదరాబాద్ మహా నగరంలో సొంతిల్లు అనేది మధ్య తరగతి కుటుంబాలకు కలగానే మిగిలిపోతుందా? శివారు ప్రాంతాల్లోనూ ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో బిల్డర్లు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తక్కువ నిడివిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తూ మధ్యతరగతికి అందుబాటు ధరలో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ పరిధిలో అపార్ట్మెంట్ల నిర్మాణం జోరందుకుంది.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారికి ముఖ ద్వారంగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతంలో కట్టినవి, కొత్తగా నిర్మించుకున్నవి కలిపి దాదాపు 600 కాలనీలు ఉండగా.. శివారు ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. నివాసానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో ఏపీతో పాటు తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్బీనగర్, నాగోలు నుంచి మెట్రో రైలు సదుపాయంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరుగుతుందా? తగ్గుతుందా?- వచ్చే ఆరునెలల్లో ఏం జరుగుతుందంటే!
విరివిగా బహుళ అంతస్తుల భవనాలు..
ఎల్బీ నగర్ శివారు ప్రాంత కాలనీల్లో గతంలో ఖాళీ స్థలాలు, ప్లాట్లు ఎక్కువగా ఉండేవి. గజం ధర కనిష్టంగా రూ.20 వేలు, గరిష్టంగా రూ.40వేల వరకు పలికేది. ఆ సమయంలో చాలామంది ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం డిమాండ్ విపరీతంగా పెరిగింది. రియల్ బూమ్‌తో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో శివారు కాలనీల్లోనూ గజం రూ.40వేలకు పైనే ఉంది. సొంతంగా స్థలం కొని ఇల్లు కట్టుకునే స్థోమత లేని మధ్య తరగతి ప్రజలు కోసం బిల్డర్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. 300 గజాలకు మించిన స్థలంలో ఫ్లాట్లను నిర్మించి విక్రయిస్తున్నారు. వీటి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలుకుతున్నాయి. తక్కువలో తక్కువగా 400గజాల స్థలంలో పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మిస్తుండగా శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల ఫ్లాటు రూ.45 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
ప్రధాన రహదారి నుంచి 4 కిలోమీటర్లైనా ..
మన్సూరాబాద్ వంటి ప్రాంతంలో మాత్రమే గతంలో అపార్ట్‌మెంట్లు కనిపించేవి. ప్రస్తుతం ప్రధాన రహదారి నుంచి దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలనీల్లోనూ అడుగడుగునా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఎల్బీనగర్ దగ్గర్లోని వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్లు రూ.50 లక్షల లోపు లభించేలా ప్లాన్ చేసి నిర్మిస్తున్నట్లు బిల్డర్లు చెప్తున్నారు.
ఇల్లు/ఫ్లాట్ కొంటున్నారా? - ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది!
హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ - జూబ్లీహిల్స్, గచ్చిబౌలి కాదు