వెదురు బొంగుల్లో తాటికల్లు - టేస్ట్ చూస్తే వారెవ్వా అనాల్సిందే - ములుగులో వెదురుబొంగుల్లో తాటికల్లు
Published : Feb 14, 2024, 2:00 PM IST
Thati Kallu in Veduru Bongu in Mulugu : ప్రకృతి సిద్ధంగా దొరికే తాటికల్లు అంటే చాలా మందికి ఇష్టం. సాధారణంగా కల్లుని కుండల్లో తీస్తారు. కానీ అక్కడ మాత్రం చెట్టు నుంచి కల్లును వెదురు బొంగుల్లో తీసి విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా కల్లుగీత పనులు గౌడ కులస్తులు మాత్రమే చేస్తుంటారు. కానీ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ సమీప అడవిలో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి 15 సంవత్సరాలుగా గుత్తికోయ గిరిజనులు కల్లు తీసి జీవిస్తున్నారు. గిరిజనులు తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి మేడారం వెళ్లే భక్తులకు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మేడారం వెళ్లే రహదారిలో ఈ తాటి చెట్లు ఉండడంతో ఈ వెదురుబొంగుల కల్లు తాగిన ప్రజలు టేస్ట్ వారెవ్వా అంటున్నారు.
Toddy Wine in Bamboo Stick in Mulugu : తాటి చెట్టుకు వెదురు బొంగు అమర్చి కల్లు గీస్తుండడంతో కల్లు కొత్త రుచి వస్తుందని గిరిజనులు అంటున్నారు. కల్లును లీటరుకు వంద చొప్పున అమ్ముతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. గత నాలుగేళ్లుగా మట్టి కుండలను కొనుక్కోలేక అడవిలో దొరికే వెదురు బొంగులను తీసుకు వచ్చి రంపంతో కోసి, ఆ పచ్చి బొంగులను గడ్డితో కాల్చి కల్లు తీసేందుకు వినియోగిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు.