ఓట్ ఆన్ బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి పరనిందలా సాగింది: టీడీపీ ఎమ్మెల్సీలు - TDP MLCs on Budget 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 9:21 AM IST
TDP MLCs Fire on YSRCP Government : జగన్ సర్కార్ ఉభయసభల్లో చేసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి పరనిందలా సాగిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ బడ్జెట్‌పై సొంతపార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. శాశ్వత భూహక్కు పేరుతో పేదల భూముల్ని కొట్టేయడమేనా జగన్ రెడ్డి వారికి చేసిన మేలు అని ప్రశ్నించారు. తన పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు కంపెనీలు ఎన్ని, కల్పించిన ఉద్యోగాలెన్నో చెప్పాలని నిలదీశారు.
AP Budget 2024 : జనవరిలో జాబ్ క్యాలెండర్, ఏటా మెగా డీఎస్సీ, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు లేదో జగన్ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. 26 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న జగన్ రెడ్డి, ఇప్పుడు కేవలం 6,100 పోస్టులకు డీఎస్సీ ఇవ్వడం కంటితుడుపు చర్య కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం అవాస్తవాలు, అంకెల గారడీ అభూత కల్పనల మేళవింపు తప్ప అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు మేలుచేసే ఒక్క అంశం కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇన్నేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కనిపించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సహా, వైఎస్సార్సీపీ నేతల దోపిడీ సామర్థ్యం పెరిగిందని ధ్వజమెత్తారు.