జగన్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడగలడా?: కొలికపూడి - జగన్ పై కొలికపూడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 8:06 PM IST
TDP leader Kolikapudi Srinivasa Rao: తన కుటుంబ అవినీతి, తన ఆర్థిక ఉగ్రవాదం, సామాజిక ఉన్మాదాలను ప్రపంచానికి తెలియచేశాయనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 ఛానళ్లపై జగన్ విషం కక్కుతున్నాడని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్‌కు నిజంగా ధైర్యముంటే, ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, ప్రజల్ని ఉద్దరించి ఉంటే చంద్రబాబు సవాల్‌కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు రాబోయే ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం ఉంటే, ఆయన ఒంటరిగా పోరాడే పులే అయితే, తనకు గిట్టని మీడియా సంస్థల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని సూచించారు.
గతంలో రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి మెుదలు జగన్ అక్రమాలపై ఈనాడు రాస్తున్నందుకే కక్షపెట్టుకున్నారని ఆరోపించారు. వాస్తవాలను తట్టుకోలేక మీడియాపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ సిద్దం అంటున్నారని, ఎన్నికల్లో డబ్బులను పంచి గెలవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక్కసారి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడగలడా అని ఎద్దేవా చేశారు. అద్దాల మేడల్లో కూర్చొని ఎదుటివారిపై జగన్ రాళ్లు వెయిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ప్రభుత్వంలో జగన్ లాగే ప్రతీకార చర్యలకు పూనుకుంటే జగన్ స్వంత పత్రిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.