"ఈ నెల 5న 'జయహో బీసీ' సభ - బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం టీడీపీ ఇచ్చింది" - BC Declaration Meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 8:51 PM IST
TDP Jayaho BC Public Meeting : బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిన గౌరవమని బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 5న రాష్ట్ర స్థాయిలో 'జయహో బీసీ (Jayaho BC)' సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం సభ జరుగుతుందని అన్నారు. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతి కోసం అమలు చేసే మేనిఫెస్టో అంశాలను డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటిస్తారని కొల్లు రవీంద్ర తెలిపారు.
BC Declaration Meeting : బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలవంతుల్ని చేయటమే తెలుగుదేశం లక్ష్యమని కొల్లు రవీంద్ర తెలిపారు. తమ సమస్యలపై బీసీలే డిక్లరేషన్ రూపొందించారని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బలహీన వర్గాల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించిన్నట‌్లు వివరించారు. క్షేత్ర స్థాయిలో దాదాపు 850 సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి బీసీ ఈ సభకు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.