టీడీపీ తొలి జాబితాలో ఎస్సీ కళాకారుడి పేరు - డప్పు కొట్టి చంద్రబాబుకు కృతజ్ఞతలు - ఎన్నికల్లో యువతకు టీడీపీ అవకాశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 7:18 PM IST
TDP Candidate Sunil Kumar Thanks To Chandrababu: టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ఎస్సీ కళాకారుడి పేరు ఉండటంతో డప్పు మోగించి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన దృశ్యం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఉప్పార్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని మారెమ్మ దేవస్థానం ప్రతిష్టాపన కార్యక్రమంలో కొత్తగా నియమించబడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అతనికి డప్పులతో, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో సునీల్ కుమార్ కళాకారులతో కలిసి డప్పు వాయించారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న యువతకు చంద్రబాబు అవకాశం కల్పించి సముచిత న్యాయం పాటించారని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సునీల్ సూచించారు.
ఇటీవల టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ఎస్సీలకు టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూనే విద్యావంతులు, పోరాట స్ఫూర్తి కలిగిన యువ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ప్రకటించిన 20 మంది అభ్యర్థుల్లో 10 మంది తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 11 మంది, మాల సామాజిక వర్గానికి చెందిన 9 మంది తొలి జాబితాలో ఉన్నారు. అధికార వైసీపీ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్ని ఇష్టానుసారం మార్చేస్తూ చాలా మందికి టికెట్‌లు ఇవ్వకుండా తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించింది.