రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్ - ఇంకా ఏం మిగిలిందని సిద్ధం అంటున్నారు: బీటెక్ రవి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 9:31 PM IST
TDP Btech Ravi Fires on CM YS Jagan: సిద్ధం సభకు రాష్ట్రమంతా పోస్టర్లు వేసి జగన్ రెడ్డి ఏం సాధించారని టీడీపీ నేత బీటెక్ రవి ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్ అని విమర్శించారు. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో ఏం మిగిలిందని సిద్ధం అంటున్నారని, ప్రజావేదిక కూల్చినట్టు ఇంకా ఏమన్నా ఉంటే కూల్చడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ మండిపడ్డారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం టీడీపీ హయాంలో కడితే, జగన్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఏరియాలో డ్రిప్ పరికరాలను రాకుండా చేసినందుకు సిద్ధమా అని బీటెక్ రవి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో కంటే ఏపీ మద్యం తాగిన వారికి 25 శాతం ఎక్కువుగా లివర్ దెబ్బ తింటోందని వైఎస్ షర్మిల చెప్పారని తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజల లివర్లు పాడు చేసేందుకేనా వైసీపీ సిద్ధంగా ఉంది అని నిలదీశారు. సొంత చెల్లెలు షర్మిలను, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను చంపేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇన్ని చేసినా ఇంకా సిగ్గు లేకుండా సిద్ధం సభలు ఎలా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండని తెలిపారు.