Fake Doctors Issue in Telangana State Wide : ఎలాంటి అర్హతలు లేకుండానే కొందరు ‘వైద్యులు’గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్టు చేస్తే మీకు రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
వారు చెప్పినవి పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు. నగరాలు, పల్లెలనే తేడాల్లేకుండా ఇలాంటివారు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లీషు వైద్యం, ఆయుర్వేదం, హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్యమండలి వైద్యులు చెబుతున్నారు.
ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో నకిలీ వైద్యులు కొత్త రకాల మందులను, డైట్లను సూచిస్తూ వైరల్ అయ్యేలా చూస్తుండటం, వాటి బారిన ప్రజలు పడుతుండటం ఆందోళన కలిగించే అంశం.
ధనార్జనే ధ్యేయంగా మిడిమిడి జ్ఞానంతో వీరు అందిస్తున్న ‘వైద్యానికి’ పలుచోట్ల పిల్లలు, గర్భిణులు, వయోధికులు సహా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వి. రాంబాబు అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా చలామణి అవుతుండగా, మెడికల్ కౌన్సిల్ అధికారులు ఈ నకిలీ వైద్యుడిని ఇటీవల హైదరాబాద్‌లో పట్టుకున్నారు. ఇలాంటి నకిలీలపై తెలంగాణ వైద్యమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సోదాలు చేపట్టారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 350 మందికిపైగా పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.
నకిలీ వైద్యుల ఉదంతాలెన్నో..!
- తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటుకు గురైన రోగికి ఓ నకిలీ వైద్యుడు అధిక మోతాదు ఇంజెక్షన్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పరిగిలోనే మరో నకిలీ వైద్యుడు ఎంబీబీఎస్ చదవకున్నా ఆ స్థాయి డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు.
- గత నెలలో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించగా అతను గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరికొన్ని మాత్రలిచ్చాడు. పరిస్థితి విషమించగా చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సి వచ్చింది.
- మంచిర్యాల జిల్లాలో పదేళ్ల చిన్నారికి వైరల్ జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఓ ‘వైద్యుడి’ వద్దకు తీసుకెళ్లగా హైడోసు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ బాలిక కన్నుమూసింది.
- మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలిక (16)ను జ్వరం, వాంతులతో ఓ ‘క్లినిక్’కు తీసుకెళ్లారు. అక్కడి ‘వైద్యుడు’ సెలైన్ పెట్టి 4 ఇంజెక్షన్లు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వైద్యం పేరుతో నకిలీ డాక్టర్... ఉద్యోగాల పేరిట కానిస్టేబుల్.. సీన్ కట్ చేస్తే..!
ఇష్టారీతిన మందులిస్తూ : రాష్ట్ర వైద్యమండలిలో నమోదైన అర్హులైన డాక్టర్లు 70 వేల మంది వరకు ఉన్నారు. మరోవైపు వైద్యం పేరిట వేల సంఖ్యలో అనర్హులు వ్యాపారం చేస్తున్నారు. మందుల దుకాణాలతో కుమ్మక్కవుతూ ఇష్టారీతిన ఔషధాలను సిఫార్సు చేస్తున్నారు. అనారోగ్యంతో తమ వద్దకు వచ్చేవారికి అవసరానికి మించి యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి మాత్రలు ఇస్తుండటంతో రోగులు తీవ్ర అస్వస్థతకు గురై కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
మరికొందరి నకిలీ వైద్యులు ఏకంగా సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్క మల్కాజిగిరిలోనే 10 మంది నకిలీ వైద్యుల గుట్టురట్టయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అర్హతల్లేకుండా చికిత్సలు చేస్తున్న 41 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ(RMP)లు, పీఎంపీ(PMP)లు కూడా వారి స్థాయికి మించి చికిత్సలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, తండాలలో కొందరు ఆర్‌ఎంపీలు అమాయక మహిళలను గర్భవిచ్ఛిత్తికి ప్రోత్సహిస్తున్నారు. మరి కొందరు ఆయుర్వేదం,హోమియో వంటి డిగ్రీలు పొంది ఇంగ్లిషు వైద్యం చేస్తున్నారు. ఇదీ చట్ట విరుద్ధమే.
దాడులు ముమ్మరం చేశాం : గత కొన్ని నెలలుగా నకిలీ, అర్హతల్లేని వైద్యులపై దాడులు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వైద్యమండలి ఛైర్మన్ డాక్టర్ కె.మహేశ్‌కుమార్ తెలిపారు. నకిలీ వైద్యవ్యవస్థను నియంత్రణకు జాతీయ వైద్యకమిషన్ (ఎన్‌ఎంసీ)కి కూడా పలు సిఫార్సులు చేసినట్లు వారు చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చికిత్స పొందడానికి అర్హులైన వైద్యులనే సంప్రదించాలని రాష్ట్ర వైద్యమండలి వైస్ ఛైర్మన వివరించారు. అర్హతల్లేని వైద్యులను గుర్తిస్తే antiquackerytsmc@onlinetsmc.in మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం అర్హతల్లేకుండా వైద్యం చేస్తే ఏడాది జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా ఉంటుందని తెలిపారు. తీవ్రతను బట్టి కేసులు పెరుగుతాయని రాష్ట్ర వైద్యమండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
గూగుల్ సాయంతో ట్రీట్మెంట్.. 3నెలల క్రితం కొత్త హాస్పిటల్.. 'శంకర్ దాదా' గుట్టురట్టు