Motorbike Clubs in Hyderabad : కాస్త సమయం దొరికితే చాలు.. బైకులు బయటికి తీసి చలో లాంగ్‌రైడ్ అంటారు. డుగ్ డుగ్ అంటూ శబ్దం చేసే వాహనాలు ఒకదాని వెంట ఒకటి హైదరాబాద్ ట్రాఫిక్‌ను దాటి కొండలు, అడవులు, గుట్టల మీదుగా దౌడ్ తీస్తాయి. ఇలా రోజుల తరబడి యాత్రలు సాగుతాయి. అలసటే లేకుండా మజిలీవైపు కదిలిపోతుంటాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ సరికొత్త ప్రపంచాన్ని చూసేందుకు బయల్దేరుతాయి. అలా అని సరదా కోసం సాగిపోవడమే కాకుండా రహదారి భద్రతపై వాహనదారుల్లో అవగాహన కల్పిస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. అవసరమైతే ఆపన్నులకు అండగా నిలుస్తూ హైదరాబాద్‌లోని రైడింగ్ క్లబ్‌లు దూసుకెళ్తున్నాయి.
హైదరాబాద్‌లో డజనుకు పైగా బైక్ రైడింగ్ క్లబ్‌లు ఉన్నాయి. నగర జీవనంలోని ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు, సాహసం నా పథం అనేవాళ్లు ఎక్కువగా బైకులపై లాంగ్ రైడ్‌లకు వెళ్తున్నారు. మగవారికే కాదు ప్రత్యేకించి మహిళలకు రైడ్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. రహదారి భద్రతపై ఎక్కువ గ్రూపులు అవగాహన కల్పిస్తున్నాయి. దేశభక్తిని పెంపొందించే ఆజాదీ రైడ్‌లు చేస్తున్నారు. మహిళా సాధికారత, పురుషులతో ధీటుగా స్త్రీలు దూసుకుపోగలమని మహిళా సభ్యులు అంటున్నారు. వాండెరర్స్ బుల్లెటర్స్ ఆఫ్ హైదరాబాద్ వంటి పాత రైడింగ్ క్లబ్ మొదలు ఇటీవల ఏర్పడిన హ్యాపీ బైకర్స్ క్లబ్ వరకు పెద్ద జాబితానే హైదరాబాద్‌లో ఉంది.
ఆకాశంలోని అద్భుతాలు : హైదరాబాద్ శివార్లలోని రిసార్టుల్లోనూ బస చేసి ఆకాశంలోని అద్భుతాలు వీక్షిస్తున్నారు. స్టేర్ గేజ్ పేరుతో ఆకాశంలోని నక్షత్రాలను టెలిస్కోప్‌లో వీక్షించేలా ఏర్పాటు చేస్తూ నైట్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అలా జీవితంలో ఉత్సాహాన్ని నింపుకొంటున్నారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేకించి కొన్ని రిసార్టులు ఉన్నాయి.
ఒకే రకం వాహనం : బుల్లెట్ వాహనాలతో ఈ క్లబ్‌ల పరంపర మొదలైందని సీనియర్ రైడర్ ఒకరు తెలిపారు. ఒకే రకం వాహనం కలిగిన వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి రైడ్‌లకు వెళ్తుంటారు. 100 కిలోమీటర్ల తక్కువ దూరం మొదలు 24 గంటల వ్యవధిలో 1250 కిలోమీటర్ల దూరం వెళ్తున్న వారూ ఉన్నారు. లెహ్ లద్దాక్, గోవా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్రలే కాకుండా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణం, వికారాబాద్ అడవుల దాకా దౌడ్ తీస్తున్నారు.
ఇతర గ్రూపులతో కలిసి : బైక్ రైడింగ్‌తోపాటు ఆయా ప్రదేశాలకు వెళ్లినప్పుడు ట్రెక్కింగ్ చేస్తుంటారు.ఈ పని చేయాలంటే కొంత శిక్షణ అవసరం. అందుకోసం ఇతర గ్రూపులతో కలిసి తర్ఫీదు పొందుతారు. గమ్యస్థానం చేరిన తర్వాత ఆయా గ్రూపులతో కలిసి పాలుపంచుకుంటున్నారు.
భార్యాభర్తలు జంటగా : రైడింగ్ క్లబ్‌లోని సభ్యులు యువతతోపాటూ ఆరుపదుల వయసు వారు ఉన్నారు. భార్యాభర్త, తండ్రీకుమారుడు కలిసి వెళ్తున్న యాత్రలు ఉన్నాయి. భర్తతో పోటీగా భార్య సైతం విడిగా మరో బైకుపై రైడ్ చేస్తూ వెళ్తున్నారు. ఎందులోనూ తాము తక్కువ కాదని చాటుతున్నారు.
రహదారి భద్రతపై అవగాహన కోసం : హిందుస్తాన్ రాయల్స్ బులిటెర్స్ క్లబ్(హెచ్‌ఆర్‌బీసీ) 2013లో ప్రారంభమైందని హెచ్‌ఆర్‌బీసీ అడ్మిన్ నవీన్ తెలిపారు. ప్రతి నెలా ఒక బ్రేక్‌ఫాస్ట్ రైడ్ ఉంటుందని ఇది 100 కిలోమీటర్ల లోపల చేస్తామని పేర్కొన్నారు. వంద కిలోమీటర్ల పైన ఉండే వాటిని లాంగ్ రైడ్స్ అంటామని చెప్పారు. ఏటా ఒకసారి గోవా వెళ్లి వస్తామని అత్యంత క్లిష్టమైన లెహ్ లద్దాక్ యాత్రను చేసినట్లు వివరించారు. తమ క్లబ్లో 200 పైగా సభ్యులు ఉన్నారని ప్రతినెలలో ఎక్కడకి వెళ్లేది వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తామని తెలియజేశారు. అందుకు అనుగుణంగా వృత్తి, ఉద్యోగాల పనులు పూర్తి చేసుకుని యాత్రకు బయల్దేరుతామని అన్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడం తమ క్లబ్ ప్రధాన ఉద్దేశమని నవీన్ వెల్లడించారు.
ఒకే చక్రంతో కన్యాకుమారి టు కశ్మీర్ సైకిల్ రైడ్- ఎందుకంటే? - Single Wheel Bicycle Ride
ఇండియాలోని టాప్-5 బైక్ రెంటల్ యాప్స్ ఇవే! - bike rent apps