సీఎం రేవంత్‌ను కలిసిన సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు - విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి
Published : Jan 24, 2024, 12:04 PM IST
Suspended TSRTC Employees Meets Revanth : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండ్, మెమో, జీతాలు కట్ తదితర చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారని వారు వాపోయారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లోని ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆర్టీసీ ఉద్యోగులు అన్నారు.
చిన్నచిన్న కారణాలతో 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా కుటుంబంతో సహా రోడ్డున పడ్డామని వాపోయారు. ఈ విషయంపై ఎండీ సజ్జనార్ కలిసేందుకు కూడా అధికారులు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సీఎంని కలవాలని ఉద్యోగులు పట్టుబట్టడంతో పోలీసులు ముగ్గురికి అవకాశం ఇచ్చారు. అనంతరం తమ సమస్యల పరిష్కారంపై సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు.