తెలంగాణ

telangana

ETV Bharat / videos

మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు - గదిలో బంధించిన తల్లిదండ్రులు - Students Lock Up Teacher In Room - STUDENTS LOCK UP TEACHER IN ROOM

By ETV Bharat Telangana Team

Published : Mar 27, 2024, 5:21 PM IST

Students Parents Lock Up Teacher In Room : పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడని ఓ ఉపాధ్యాయున్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గదిలో తాళం వేసి బంధించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఈ విధంగా ప్రవర్తించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారమందుకున్న విద్యాశాఖ అధికారి ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం ఓ ఉపాధ్యాయుడిని పాఠశాలకు పంపారు. ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయుడిని విడుదల చేశారు.  

ఇదీ జరిగింది
చర్ల మండలంలోని జిపి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కృష్ణ అనే వ్యక్తి ఇన్​ఛార్జ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రోజూ మద్యం సేవించి పాఠశాలకు రావడమే కాకుండా తమ పిల్లలను కొడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని ఓ గదిలో బంధించి తాళం వేశారు. ఉపాధ్యాయుడు ఇవాళ కూడా మద్యం సేవించి వచ్చాడని తల్లిదండ్రులు ఆరోపించారు.  

అయితే ఉపాధ్యాయుడు వ్యక్తిగత సమస్యల కారణంగా పాఠశాలకు తాగి వస్తున్నానని ఓసారి, అసలు మద్యం సేవించేలేదని భిన్నమైన సమాధానాలు చెబుతున్నాడు. పై అధికారులకు ఈ విషయం తెలిసినా తనకు ఏమీ కాదని మద్యం మత్తులో ఉపాధ్యాయుడు కృష్ణ చెప్పినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ తాగుబోతు టీచర్ ఉంటే తమ పిల్లలను పాఠశాలకు పంపించమని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖాధికారి విచారణ నిమిత్తం పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని పంపించారు. ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఉపాధ్యాయుడిని విడుదల చేశారు.  

ABOUT THE AUTHOR

...view details