ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇవ్వొద్దు - ప్రొద్దుటూరులో అసమ్మతి గళం - Class differences in YCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:37 PM IST
Siva Chandra Reddy Criticized on MLA Rachamallu Siva Prasad Reddy : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు ప్రచారం నిర్వహించారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. 'జగన్ ముద్దు - ఎమ్మెల్యే రాచమల్లు వద్దు' అంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి నిర్ణయంపై సీఎం జగన్ పునరాలోచించాలన్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇస్తే పార్టీకీ తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు.
ప్రొద్దుటూరులో వైఎస్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఆ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోతే టికెట్ తనకే ఇవ్వాలని శివచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాని రాచమల్లుకు టికెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమన్నారు. సీఎం జగన్‌కు ప్రొద్దుటూరు గురించి అన్ని విషయాలు తెలుసన్నారు. పులివెందుల తరువాత ప్రొద్దుటూరులోనే వైఎస్ కుటుంబానికి అభిమానులు ఎక్కువగా ఉన్నరన్నారు. ప్రొద్దుటూరులో అసమ్మతి నాయకులు ప్రచారం నిర్వహించడంతో పోలీసులు భారీగా మోహరించారు.