రేపు సర్పంచ్లతో 'చలో అసెంబ్లీ': వైవీబీ రాజేంద్రప్రసాద్ - సర్పంచ్ల చలో అసెంబ్లీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 7:32 PM IST
YSRCP Govt Diverted Sarpanch Funds: చలో అసెంబ్లీకి రెండు రోజులు ముందే సర్పంచుల అక్రమ అరెస్టులు దారుణమని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఆయన మండిపడ్డారు. మంగళవారం సర్పంచ్లతో "చలో అసెంబ్లీ" నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. సర్పంచ్ల సంఘం, పంచాయతీ రాజ్ చాంబర్ల నాయకులను 13 జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిందని ఆరోపించారు. సర్పంచ్ తడాఖాను ఈ ప్రభుత్వానికి రుచి చూపించి, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
రెండు రోజుల ముందు నుంచే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్భందాలకు భయపడబోమని హెచ్చరించారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, అలాంటి బెదిరింపులకు బయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ను నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి రెండు జీపులు, 20 మంది పోలీసులతో ఇంటిని చుట్టుముట్టి అక్రమంగా నిర్బంధించారు. మరోవైపు జిల్లా పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు మండలాల్లో సర్పంచ్లు, టీడీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నాగులపాలెం సర్పంచ్ సుధారాణికి నోటీసులు అందజేశారు. అసెంబ్లీ ముట్టిడికి యత్నించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.