అన్నొచ్చాడంటే ప్రయాణికులకు కష్టాలే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 11:40 AM IST
RTC Passengers Problem with CM Meeting: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యట ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెట్టింది. పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం ఎన్. అగ్రహారం వస్తున్నారు. సీఎం సభ (CM Meeting) కోసం జిల్లా నలుమూలల నుంచి జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు కేటాయించారు. కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి 20 బస్సులు కేటాయించారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లలో (Bus Stand) గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అధిక ఛార్జీలు వెచ్చించి ఆటోల్లో గమ్యస్థానానికి వెళ్తున్నారు.
కందుకూరు వెళ్లేందుకు ఉదయం 8 గంటల నుంచి డిపో వద్ద ప్రయాణికులు భారీ సంఖ్యలో వేచి ఉన్నప్పటికీ ఆర్టీసీ (RTC) యాజమాన్యం పట్టనట్లుగా వ్యవహరించింది. ఇది గమనించిన ఈనాడు, ఈటీవీ ప్రతినిధులు ఉదయం 10 గంటలకు అక్కడ వీడియోలను చిత్రీకరిస్తుండడంతో ఇది గమనించిన ఆర్టీసీ యాజమాన్యం వెనువెంటనే ఓ బస్సును ఏర్పాటు చేశారు. బస్సు బస్టాండ్ లోకి వచ్చి ఆగి ఆగకముందే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సులో ఎక్కేందుకు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లారు.