వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు - రాత్రంతా సహాయం కోసం ఎదురుచూపులు - చివరకు? - RTC Bus Stuck in Flood water
Published : Sep 1, 2024, 11:32 AM IST
RTC Bus Stuck in flood Water : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో చెరువు అలుగులో TS 24 Z 0018 నంబర్ గల ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. శనివారం సాయంత్రం వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బస్సు, వెంకటాపురం చేరుకునే సరికి చెరువు మత్తడి పెరిగింది. బస్సు కల్వర్టు దాటి ముందుకెళ్లడంతో మత్తడిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని డ్రైవర్ వెనక్కి తీసుకొచ్చేలోపే ముందు దాటిన కాల్వర్టులో వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. దీంతో బస్సు వరదలో చిక్కుకుంది.
అదే సమయంలో నెక్కొండ ఎస్సైకి సమాచారం అందించగా, ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ధైర్యం చెప్పి సహాయక చర్యలకు పూనుకున్నారు. అర్ధరాత్రి కావడంతో ఎలాంటి సహాయక చర్యలు అందలేదు. ఈ క్రమంలో ఆదివారం సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, అధికారులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వెంకటాపురం గ్రామ సమీపంలో ప్రయాణికులకు కనీస వసతిని ఏర్పాటు చేసి, గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.