అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు - ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు - Road Accident - ROAD ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 5:43 PM IST
Road Accident in Sri Sathya Sai District: కుమార్తెను కళాశాలలో జాయిన్ చేర్చేందుకు చెన్నై బయలుదేరిన తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, తల్లీ కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారి 42పై కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం మండలం ఉప్పరపల్లెకు చెందిన చంద్రమోహన్ రెడ్డి కుమార్తె భవ్యశ్రీని ఇంజనీరింగ్‌లో జాయిన్ చేసేందుకు భార్యతో కలిసి చెన్నైకి బయల్దేరారు. ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డుపై గేదెను తప్పించే క్రమంలో వేగాన్ని నియంత్రించుకోలేక వాహనం చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన చంద్రమోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తల్లీ కుమార్తెలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.