వాలంటీర్ల విషయంలో సీఎఫ్‌డీ వినతిపై సీఈసీని ఆదేశించిన హైకోర్టు- మూడు వారాల్లో నిర్ణయం వెల్లడించాలని విజ్ఞప్తి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 12:33 PM IST
Ramesh Kumar Has Filed a PIL in High Court: వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ(CITIZEN FOR DEMOCRACY) సంస్థ ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సీఈసీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్. రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
బుధవారం జరిగిన విచారణలో న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ వినతిపై మూడు వారాల్లో తగిన నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇకనైనా ఎలక్షన్ కమిషన్, సీఈవో స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పటంతో సీఎఫ్‌డీ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సీఎఫ్‌డీ స్పష్టం చేసింది.