వామ్మో ఇదేందయ్యా ఇదీ - ఆలయ ప్రాంతంలో మద్యం తాగిన ఈవో - వీడియో వైరల్ - EO drinking alcohol in temple - EO DRINKING ALCOHOL IN TEMPLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 3:54 PM IST
Temple EO was Drinking Alcohol in YSR District : సాధారణంగా దేవాలయ పరిసర ప్రాంతాలకు వెళ్తే అందరికీ సంకీర్తనలు, భక్తుల సందడి, ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. అక్కడ మాంసాహరం, మద్యం దరిదాపుల్లో కనిపించవు. కానీ కడప జిల్లా పులివెందులలో ఉన్న ఓ దేవాలయ కళ్యాణ మండపంలో మాత్రం ఏకంగా మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగు చూశాయి. ఇక్కడ ఎవరో అకతాయిలు ఈ పని చేశారంటే మీరు పొరపాటు పడినట్లే. సాక్ష్యాత్తు ఆలయ ఈవోనే మద్యం సేవించడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని స్థానిక మిట్ట మల్లేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఆ దేవాలయంతో పాటు స్థానికంగా ఉన్న సింహాద్రిపురం, వేంపల్లి, జమ్మలమడుగు ఆలయాలన్నింటికీ ఈవోగాా విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ అధికారి స్థానికంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి మల్లేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన కళ్యాణ మండపంలో మద్యం సేవిస్తున్న దృశ్యాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. టెంపుల్ ఆవరణంలో మద్యం తాగుతున్న ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది.
దీంతో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ నరసింహ సింగ్ ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు వచ్చి విచారణ చేపట్టారు. అయితే ప్రతిరోజు పలువురు ఎండోమెంట్ ఉద్యోగులు తమ విధులు ముగిశాక సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి సమయం వరకూ మద్యం సేవిస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.