భాకరాపేట కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - డమ్మీ పిస్టల్, మత్తు సిరంజీలు స్వాధీనం - KIDNAP CASE - KIDNAP CASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 5:59 PM IST
Police Solved the Bakarapeta Kidnap Case in Tirupati District : తిరుపతి జిల్లా భాకరాపేటలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ఊర్జా హోటల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవడంతో కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24న చిన్నగొట్టిగల్లు మండలం చెరువుమందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్‌ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని భాస్కర్ కుమారుడు రెడ్డి కిరణ్‌ను కిడ్నాపర్లు బెదిరించారు. దీంతో రెడ్డి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు భాకరాపేట సమీపంలో గాలింపు చేపట్టారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. నిందితుల వద్ద ఉన్న డమ్మీ పిస్టల్, మత్తు సిరంజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజులకుపైగా రెక్కీ నిర్వహించి భాస్కర్‌ను కిడ్నాప్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులు పాత నేరస్తులుగా గుర్తించామన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు.