ఈసారి పీఠం కూటమిదే - పిఠాపురంలో స్పష్టం చేసిన పవన్ - Pawan kalyan Pithapuram Tour
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 5:59 PM IST
Pawan Kalyan Meets TDP Leader Varma : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గొల్లప్రోలుకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి చేరుకున్నారు. వర్మను పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కల్యాణ్‌కు వర్మ, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నాయకుల్ని వర్మ పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు.
Pawan Kalyan Pithapuram Tour : వర్మ పిఠాపురం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు కష్టించి పని చేశారని ఆయన సీటు తనకు త్యాగం చేశారని పవన్ తెలిపారు. పార్టీ పటిష్టత కోసం వర్మ కృషి చేశారని పవన్ కొనియాడారు. ఈసారి పీఠం కూటమిదే అని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో నెగ్గుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పవన్ గెలుపు కోసం నిజాయితీతో తెలుగుదేశం శ్రేణులు పని చేస్తాయని వర్మ హామీ ఇచ్చారు. పిఠాపురంలో అత్యధిక మోజార్టీతో పవన్ కల్యాణ్‌ను గెలిపించుకుంటామని వర్మ తెలిపారు.