కలుషిత నీటి అంశంపై అధికారుల చర్యలు - ఆరుగురు సస్పెండ్, ఇద్దరికి షోకాజ్ నోటీసులు - officers suspend in guntur district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 2:09 PM IST
Officers Suspended in Contaminated Water issue : గుంటూరులో కలుషిత నీరు సమస్యకు కారకులైన అధికారులపై నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆరుగురిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్, పారిశుద్ధ్య విభాగానికి చెందిన శానిటరీ ఇన్ స్పెక్టర్, నలుగురు వార్డు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. పొరుగు సేవల విభాగంలో పని చేసే వాల్వ్ ఆపరేటర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. డీఈ, శానిటరీ సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాలుష్య నీరు కారణంగా ప్రజలు అనారోగ్యం పాలైన శారదా కాలనీ, శ్రీ నగర్ కాలనీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. అక్కడ జరిగిన డ్రైనేజీ కాలువల నిర్మాణం, కుళాయి కనెక్షన్ల మంజూరు, పైపులైన్ల పనులు అస్తవ్యస్తంగా జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని నిర్థారణకు వచ్చారు. ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.