ఏపీలో ప్రభుత్వం,పార్టీ మద్య తేడా లేదు- ఎన్నికల అక్రమాలకు రాష్ట్రం ఓ యూనివర్శిటీ : నిమ్మగడ్డ రమేష్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 4:39 PM IST
Nimmagadda Fire on Election Process in Vijayawada : ఎన్నికల అక్రమాలకు ఏపీ ఓ యూనివర్శిటీగా మారిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని సిద్ధార్ధ కళాశాలలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని తెలియజేశారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల జాబితా ప్రధానమని తెలిపారు. అలాంటి ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పార్టీ నీడ కూడా ప్రభుత్వంపై పడకూడదని నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలియజేశారు. ప్రజల్లో చైతన్యం నిశ్శబ్ద ఉద్యమంగా మారాలని వ్యాఖ్యానించారు.మనదైన ప్రజాస్వామ్యాన్ని బలపర్చుకోవడానికి ఓటు ఆయుధంగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. యువత ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలని తెలియజేశారు. ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలని పేర్కొన్నారు.