ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాం - రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం: లోకేశ్ - Lokesh Speech at Independence Day

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 1:10 PM IST

Nara Lokesh (ETV Bharat)

Nara Lokesh Speech at Independence Day Celebrations: ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో లోకేశ్​ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులు, ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో అందరం కలసికట్టుగా పని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కలిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఆంక్షలు, అనవసరమైన నిబంధనలు ఉండవని, సంక్షేమ కార్యక్రమాలల్లో కోత విధించమని లోకేశ్ స్పష్టం చేశారు. 

సూపర్ – 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకే సారి వెయ్యి రూపాయిలు పెంచి  4 వేల పెన్షన్ అమలు చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించి 16 వేల 347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని లోకేశ్ వెల్లడించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుందని, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్నాయన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1500 ఆర్థిక సాయం, ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details