ఇసుక మాఫియా ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో? : లోకేష్ - Nara Lokesh on Sand Liquor Mafia - NARA LOKESH ON SAND LIQUOR MAFIA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 7:42 PM IST
Nara Lokesh on Sand Liquor Mafia: రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా నిత్యం మనుషులను చంపేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తమ భర్త ఇంటికి తిరిగి రాలేడనే భయం మహిళలను వెంటాడుతోందన్నారు. ఇసుక మాఫియాకు బలైన మరో ప్రాణం బాపట్లలో బయటపడిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మరో కుటుంబాన్ని నాశనం చేసిందని లోకేష్ దుయ్యబట్టారు. బాపట్లలోని ఇసుక ప్రాంతంలో బయటపడ్డ మృతదేహానికి ఇసుక మాఫియా కారణమనే తెలుస్తోందని ఆరోపించారు. ఈ ఆందోళనకర పరిస్థితులు రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితిని ప్రశ్నిస్తున్నాయని లోకేష్ అన్నారు.
ఇదీ జరిగింది: బాపట్ల పద్మనాభునిపేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి అనే మహిళ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్మెంట్ను పూడ్చేందుకు ఇసుక కోసం ఆమె ట్రాక్టర్ డ్రైవర్లకు తెలిపింది. ట్రాక్టర్లో ఇసుక గుట్టగా పోసిన ట్రాక్టర్ డ్రైవర్, అందులో ఉన్న మృతదేహాన్ని గమనించకుండా వెళ్లిపోయాడు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని నింపేందుకు ఇసుక తీస్తుండగా, ఒక్కసారిగా అందులో నుంచి తల లేని పురుషుడి మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.